నగరంలోని 26వ డివిజన్ లక్ష్మీపురం వాసుల నీటి కష్టాలు రోడ్డెక్కాయి. గత రెండేళ్లుగా నల్లాల్లో నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కాలనీవాసులు బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో భారీ ఆందోళన చేపట్టారు. కనీసం వాడకానికి కూడా నీరు అందడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పైపులైన్ల కోసం తీసిన గుంతలను పూడ్చకపోవడంతో వాహనదారులు, బాటసారులు పడి గాయపడుతున్నారని మండిపడ్డారు.

పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, అందుకే కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తమకు వెంటనే శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు.
