శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ సముద్ర తీరంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్తుండగా అలల తాకిడికి బోటు బోల్తా పడి చెక్క గోపాలరావు (40) అనే మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు.
దేవునల్తాడకు చెందిన గోపాలరావు మరో నలుగురు తోటి మత్స్యకారులతో కలిసి వేకువజామున ఇంజన్ బోటులో వేటకు బయలుదేరారు. తీరం దాటుతున్న సమయంలో భారీ అలలు ఒక్కసారిగా తాకడంతో బోటు నియంత్రణ తప్పి బోల్తా పడింది. బోటులోని నలుగురు మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరగా, గోపాలరావు నీట మునిగి మృతి చెందాడు. తోటి మత్స్యకారులు గాలించి గోపాలరావు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపాలరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
