ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయ సంఘాల (SHG) మహిళా శక్తిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు తయారు చేస్తున్న 23 వేలకు పైగా ఉత్పత్తులకు ‘అంతర్జాతీయ బ్రాండింగ్’ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

అరకు కాఫీ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రాండింగ్ చేసి, మహిళా ఉత్పత్తులకు దేశ విదేశాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. మహిళా సంఘాలు, మైక్రో ఎంట్రప్రెన్యూర్లకు ఆర్థికంగా స్థిరత్వం చేకూర్చడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.

ఉత్పత్తుల విక్రయాల కోసం వ్యవస్థీకృత మరియు వినూత్న మార్కెటింగ్ పద్ధతులను అవలంబించాలి.కేవలం ఉత్పత్తులకే పరిమితం కాకుండా పశుసంవర్ధక, సేవల రంగాల్లోనూ మహిళా సంఘాలు రాణించేలా ప్రోత్సహించాలి.ఈ సమావేశంలో సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు ఉన్నతాధికారులు పాల్గొని, మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
