జిల్లాలోని బిక్కనూరు మండల కేంద్రంలో నేడు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రతిపాదిత ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు.

ఫార్మా కంపెనీ ఏర్పడితే బిక్కనూరు మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుషితమై ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ పిలుపునకు రామేశ్వర్ పల్లి, పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి, పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.
మండల కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. తమ ప్రాంతాన్ని కాపాడుకునే వరకు పోరాటం ఆపబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు.
