భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న సాన్నిహిత్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గుర్తుచేసుకున్నారు. హౌస్ జీఓపి (House GOP) సభ్యుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. కొన్నేళ్ల క్రితం భారత్ ఆర్డర్ చేసిన అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని భారత్ తనను కోరినట్లు తెలిపారు.
భారత్ ఆర్డర్ చేసిన 68 అపాచీ హెలికాప్టర్లను త్వరితగతిన పంపాల్సిందిగా ప్రధాని మోదీ స్వయంగా తనను కోరినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆనాటి ఘటనను వివరిస్తూ.. “ప్రధాని మోదీ నన్ను కలవడానికి వచ్చారు. ‘సర్.. నేను మిమ్మల్ని కలవవచ్చా?’ అని అడిగారు. ఆ హెలికాప్టర్లు వారికి చాలా వేగంగా కావాలని కోరారు” అని ట్రంప్ చెప్పారు.

తన అధ్యక్ష కాలంలో విదేశీ నాయకులతో తనకు ఎలాంటి సంబంధాలు ఉండేవో వివరించే క్రమంలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన “అమెరికా ఫస్ట్” విధానం అంతర్జాతీయంగా ఎంతటి ప్రభావం చూపిందో ఆయన ఉదహరించారు. అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ ప్రధానమైనది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆధునీకరణలో ఈ అపాచీ హెలికాప్టర్లు అత్యంత కీలకమైనవి.
