సంక్రాంతి పండుగ వేళ ప్రాణాంతకమైన చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) విక్రయాలపై హైదరాబాద్ నగర పోలీసులు కొరడా ఝుళిపించారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ నిషేధిత మాంజాను అరికట్టేందుకు నగరవ్యాప్తంగా నిర్వహించిన దాడులలో భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
నగరవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ. 1,24,52,000 విలువైన 6,226 మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో టాస్క్ ఫోర్స్ విభాగం అత్యధికంగా 67 కేసులను నమోదు చేసింది. “మన సంతోషం మరొకరి ప్రాణానికి ముప్పు కాకూడదు” అని సిపి వి.సి. సజ్జనర్ పేర్కొన్నారు. విక్రయదారులతో పాటు ఆన్లైన్లో కొనుగోలు చేసే వారిపై కూడా నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

ప్లాస్టిక్, గ్లాస్ కోటింగ్ ఉండే ఈ మాంజా వల్ల పక్షులు మరణించడమే కాకుండా, విద్యుత్ లైన్ల ద్వారా పిల్లలకు షాక్ కొట్టే ప్రమాదం ఉందని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే వెంటనే ‘డయల్ 100’ లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
