అమలాపురం మున్సిపాలిటీలో కామనగరువు గ్రామం విలీనం అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విలీనాన్ని సమర్థించే వారు, వ్యతిరేకించే వారు రెండు వర్గాలుగా విడిపోయి పంచాయతీ కార్యాలయం వద్ద పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో కామనగరువు సర్పంచ్ నక్కా అరుణ భర్త నక్కా చంద్రశేఖర్ తలకు తీవ్ర గాయమైంది.
కామనగరువును అమలాపురం మున్సిపాలిటీలో కలపాలంటూ కొందరు, వద్దంటూ మరికొందరు గత కొంతకాలంగా వాదించుకుంటున్నారు. గురువారం ఈ అంశంపై పంచాయతీ వద్ద చర్చ జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి దాడుల వరకు వెళ్లింది. కర్రలు, రాళ్లతో కొట్టుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో సర్పంచ్ భర్త చంద్రశేఖర్ తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. వెంటనే ఆయనను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
