సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులను సంరక్షించి, తీర ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘మిస్టీ’ (MISHTI) పథకాన్ని అమలు చేస్తోంది. గురువారం విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ జాతీయ వర్క్‌షాప్‌ను నేషనల్ క్యాంపా (CAMPA) CEO ఆనంద్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

మడ అడవులు (mangrove)తుపానులు, ఉప్పెనల నుంచి తీర ప్రాంతానికి సహజ రక్షణ గోడలా పనిచేస్తాయని, ఇవి క్షీణిస్తే భూగర్భ జలాల్లో ఉప్పునీరు చేరి వ్యవసాయం దెబ్బతింటుందని ఆనంద్ మోహన్ హెచ్చరించారు.ఈ పథకానికి క్యాంపా నిధుల నుండి 10% (రూ. 825 కోట్లు) కేటాయించగా, ఇప్పటివరకు రూ. 100 కోట్లు వినియోగించినట్లు తెలిపారు. గుజరాత్, ఏపీ మినహా ఇతర రాష్ట్రాల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 50,000 హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయని, గత నాలుగు దశాబ్దాలుగా వీటి విస్తీర్ణం పెరుగుతూ రావడం సానుకూల అంశమని పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు తెలిపారు.రాష్ట్ర తీర ప్రాంతంలో 30% కంటే ఎక్కువ భాగం కోతకు గురవుతోందని, దీనిని అరికట్టడానికి NCCR సహకారంతో మేనేజ్మెంట్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి అటవీ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా డీఎఫ్వో జి. సతీష్ రెడ్డి మరియు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
