సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సద్విమర్శలను స్వాగతిస్తామని, కానీ కుట్రపూరిత పోస్టులను సహించేది లేదని స్పష్టం చేశారు.మహిళలపై అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ముఖ్యంగా ఏఐ (AI) ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్‌ను అరికట్టాలని ఆదేశించారు. విదేశాల్లో ఉండి అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిని పట్టుకునేందుకు బలమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు లోకేష్ తెలిపారు.
ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో అమలవుతున్న కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. సోషల్ మీడియా కేసుల్లో నెల రోజుల్లోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం(Character assassination) చేసే వారు ఏ పార్టీ వారైనా సరే జైలుకు పంపడమే తమ విధానమని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
