తెలుగుదేశం పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి నివాసంలో నూతనంగా నియమించిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు జోనల్ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు.

పార్టీలో చంద్రబాబు నాయుడు ఒక్కరే నాయకుడని, నాతో సహా మిగతా వారంతా పార్టీ సైనికులేనని లోకేష్ పేర్కొన్నారు. అందరిదీ ఒకటే అజెండాగా ఉండాలని స్పష్టం చేశారు.1999 తర్వాత మళ్ళీ వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర పార్టీకి లేదని, వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆ చరిత్రను తిరగరాయాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

ప్రతి మూడు నెలలకోసారి పార్లమెంటరీ పార్టీ నేతల పనితీరుపై సమీక్ష ఉంటుందని, తప్పులు ఉంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్త సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని, ‘MY TDP’ యాప్ ద్వారా ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.TDPలో కార్యకర్తే అధినేత అని, పనిచేసే వారికి తగిన గుర్తింపు, నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా దక్కుతాయని హామీ ఇచ్చారు.కూటమి పార్టీలతో కలిసికట్టుగా 15 ఏళ్ల పాటు ముందుకు వెళ్లాలని, నెలకోసారి వారి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచుతామని, సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించాలని నేతలకు మంత్రి లోకేష్ సూచించారు.
