ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 19 నుండి 25 వరకు జరగనున్న రథసప్తమి వేడుకలను పటిష్ట బందోబస్తుతో నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆలయ పరిసరాల్లో నిరంతరం CCTV కెమెరాల నిఘా ఉండటంతో పాటు, డ్రోన్ కెమెరాల ద్వారా జనసందోహాన్ని పర్యవేక్షించనున్నారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు, హెలిప్యాడ్ భద్రత మరియు విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.100/- దర్శనం మరియు ఉచిత దర్శనం క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడ్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సేవలు మరియు భద్రత పర్యవేక్షణ కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది.

రెవెన్యూ, మున్సిపల్ మరియు ఆలయ అధికారులతో కలిసి భద్రతా చర్యలను ఎస్పీ సమీక్షించారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఆలయ ఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
