ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను (MSMEs) ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ (AP-CDP) కు ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ పథకం తాలూకు విప్లవాత్మక మార్పులను వివరించారు.
రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ప్రింటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, గోల్డ్ వంటి రంగాల్లో చిన్న పరిశ్రమలకు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా సుమారు 1,840 MSME యూనిట్లకు లబ్ధి చేకూరడమే కాకుండా, 7,500 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేంద్రంలోని PMEGP తరహాలోనే రాష్ట్రంలో ‘సీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం’ ను ప్రారంభించనున్నారు. దీని కింద తయారీ యూనిట్లకు రూ. 50 లక్షలు, సర్వీస్ యూనిట్లకు రూ. 20 లక్షల వరకు రుణ సబ్సిడీ లభిస్తుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ. 1500 కోట్ల ఎంఎస్ఎంఈ రాయితీలలో ఇప్పటికే రూ. 438 కోట్లు విడుదల చేశామని, మిగిలిన రూ. 1000 కోట్లను త్వరలోనే సర్దుబాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ‘మన డబ్బులు – మన లెక్కలో’ మొబైల్ యాప్ ద్వారా మహిళా సంఘాల లావాదేవీల్లో పారదర్శకత పెంచామని, ఫేక్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అనర్హులను తొలగిస్తూనే, అర్హత ఉండి పొరపాటున ఆగిపోయిన వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
