ప్రపంచస్థాయి విద్యను అందించడంలో బిట్స్ పిలానీ (BITS Pilani) భారతదేశానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ‘బిట్సా గ్లోబల్ మీట్’ (BGM26) ఆరో ఎడిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తును శాసిస్తున్న తరుణంలో, యంత్రాలు డేటాను విశ్లేషించగలవు కానీ మానవ సృజనాత్మకతకు, కరుణకు ప్రత్యామ్నాయం కాలేవని గవర్నర్ స్పష్టం చేశారు. బిట్స్ పిలానీ కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, సమాజ హితం కోరే నాయకత్వ లక్షణాలను, నైతిక విలువలను పెంపొందిస్తోందని ప్రశంసించారు. విశ్వవిద్యాలయాలకు పూర్వ విద్యార్థులే ప్రాణవాయువు వంటివారని, వారి విజయాలే సంస్థ వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. యువతకు మార్గదర్శకులుగా నిలిచి దేశ స్వయం సమృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై రోబోటిక్స్, బయోటెక్నాలజీ, వాతావరణ పరిష్కారాల వంటి రంగాల్లో బిట్స్ విశిష్టంగా ఎదుగుతోందని శ్లాఘించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ (IAS), బిట్స్ వైస్ ఛాన్సలర్ వి. రామగోపాల్ రావు, బీజీఎం ఛైర్‌పర్సన్ అనిత సాకూరు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు ముగింపులో సంప్రదాయ ‘ఖవ్వాలీ’ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.
