తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా జిల్లాల వారీగా కీలక నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కీలక నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. నిన్న వరంగల్ జిల్లా నేతలతో భేటీ అయిన కేటీఆర్, రేపు ఖమ్మం మరియు నిజామాబాద్ జిల్లాల నాయకులతో సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త నమ్మకాన్ని ఇచ్చాయని, అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
