నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి, ప్రయాణాలను సురక్షితం చేసే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (IPS) నేతృత్వంలో అనుబంధ శాఖల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఐసీసీసీ (ICCC) భవనంలో జరిగిన ఈ భేటీలో కలెక్టర్ హరిచందన దాసరి, జీహెచ్ఎంసీ మరియు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

కమిషనరేట్ పరిధిలో గుర్తించిన 45 ప్రమాదకర ప్రాంతాలలో (BLACK SPOTS) ఇప్పటికే 42 ప్రాంతాలను సరిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేయాలని సీపీ ఆదేశించారు. నగరవ్యాప్తంగా 4,585 జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేశామని, 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో (FoB) 15 ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణలో లైటింగ్ వ్యవస్థ కీలకమని, పనిచేయని స్ట్రీట్ లైట్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. ఇప్పటికే 1,687 కి.మీ మేర లేన్ మార్కింగ్ పూర్తయినట్లు అధికారులు వివరించారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి నెల రెండో శుక్రవారం అన్ని శాఖల సమన్వయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో ట్రాఫిక్ జేసీ జోయల్ డేవిస్, జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఆర్టీసీ మరియు ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.
