రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నెల్లూరు సెంట్రల్ జైలును ఆకస్మికంగా సందర్శించి, జైలు నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, జైలు అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖైదీల బ్యారెక్లను సందర్శించి, వారికి అందుతున్న భోజన నాణ్యతను హోం మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న పలు రకాల ప్రోడక్ట్స్‌ను చూసి అనిత అభినందించారు. అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం జైళ్లు, ఫైర్ విభాగాల్లో నియామకాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. త్వరలోనే ఈ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రౌడీ మూకల ఆటకట్టించామని.. ‘రప్పా.. రప్పా..’ బ్యాచ్‌లు లేదా ఇతర అసాంఘిక శక్తులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు పోలీసులు రౌడీయిజాన్ని రూపుమాపడంలో బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
