మహారాష్ట్రలో బ్యాంకు మేనేజర్‌ను కత్తితో బెదిరించి నగదుతో పరారవుతున్న కరుడుగట్టిన డెకాయిటీ ముఠాకు బాపట్ల పోలీసులు చుక్కలు చూపించారు. బాపట్ల పట్టణ సీఐ రాంబాబు తన ప్రాణాలకు తెగించి, కిక్కిరిసిన రైలులో నిందితులను బేడీలు వేసిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర పోలీసుల సమాచారం మేరకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాలతో సీఐ రాంబాబు రంగంలోకి దిగారు. నిందితులు కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. సంక్రాంతి రద్దీతో రైలు కిక్కిరిసి ఉన్నప్పటికీ, రైలు బాపట్ల స్టేషన్ చేరుకోగానే సీఐ రాంబాబు నేరుగా బోగీలోకి దూసుకెళ్లారు. నిందితుల వద్ద కత్తులు ఉన్నాయని తెలిసినా, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ముందుకు వెళ్లారు.

నిందితులు తేరుకునే లోపే చాకచక్యంగా చుట్టుముట్టి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 6,72,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాంబాబు సాహసాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫోన్ ద్వారా స్వయంగా అభినందించారు. వృత్తి నైపుణ్యంతో నిందితులకు చుక్కలు చూపిన సీఐ బృందాన్ని జిల్లా ఎస్పీ కొనియాడారు
