ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో జరిపిన భేటీ ఎంతో ఫలప్రదమైంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ సూత్రప్రాయంగా అంగీకరించింది.

ఏపీలో దుబాయ్ తరహా ఫుడ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు యూఏఈ అంగీకరించింది. దీనివల్ల రాష్ట్రంలోని రైతులకు మేలు జరగడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
దాదాపు 40 ప్రముఖ యూఏఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్లను స్థాపించేలా ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని మంత్రి అల్ మార్రీ హామీ ఇచ్చారు. యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ రాష్ట్రంలో భారీ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై ఆసక్తి కనబరిచింది. డీపీ వరల్డ్ (DP World) భాగస్వామ్యంతో పోర్ట్ టెర్మినల్స్, అమరావతిలో ఆధునిక లైట్ గేజ్ స్టీల్ నిర్మాణ యూనిట్లు, మరియు విశాఖలో లూలూ గ్రూప్ మెగా మాల్ నిర్మాణంపై సానుకూల చర్చలు జరిగాయి.
ఏడీఎన్‌ఓసీ (ADNOC) ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు ముగిశాయి.ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొని ఏపీలోని పెట్టుబడి అనుకూలతలను వివరించారు.
