విశాఖ ఉత్సవాలు 2026లో భాగంగా భీమిలి సముద్ర తీరంలో జరగనున్న పడవల పోటీల సందడి మొదలైంది. ఈ నెల 29న నిర్వహించనున్న తుది పోటీల కోసం మంగళవారం తీరంలో బోట్ల ‘ట్రయల్ రన్’ నిర్వహించారు. భీమిలి అలలపై పడవలు వేగంగా దూసుకుపోతుంటే స్థానిక ప్రజలు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
సంప్రదాయ మరియు యంత్ర పడవలతో మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ట్రయల్ రన్ ద్వారా అలల వేగాన్ని, రూట్ మ్యాప్‌ను నావికులు అంచనా వేశారు.విశాఖ ఉత్సవాల్లో భాగంగా భీమిలి బీచ్‌ను అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దారు. హాట్ ఎయిర్ బెలూన్స్ రద్దయిన నేపథ్యంలో పడవల పోటీలే ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సముద్రంలో నిర్వహించే ఈ పోటీల దృష్ట్యా కోస్ట్ గార్డ్ మరియు మెరైన్ పోలీసులు భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. 29వ తేదీన జరగబోయే అసలైన పోటీల కోసం భీమిలి తీరం సిద్ధమైంది. ఈ ఉత్కంఠభరిత పోరును వీక్షించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది.
