విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బంధువులకు అప్పనంగా కట్టబెడుతున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గీతం యూనివర్సిటీ కబ్జాలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం వైయస్సార్సీపీ నేతలతో కలిసి జీవీఎంసీ కమిషనర్ మరియు మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు.
రూ. 5 వేల కోట్ల విలువైన భూమిని ఎంపీ భరత్‌కు చెందిన గీతం సంస్థకు రెగ్యులరైజ్ చేయడం దుర్మార్గమని బొత్స పేర్కొన్నారు. ఈ నెల 30న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ అజెండా నుంచి ఈ అంశాన్ని తొలగించాలని కోరారు. నీతి ప్రవచనాలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఈ దోపిడీని సమర్థిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ఇది మీ “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” ఆ అని ఎద్దేవా చేశారు. గురువారం వైయస్సార్సీపీ బృందం గీతం కబ్జాలో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని, 30వ తేదీన కౌన్సిల్ సమావేశం వద్ద ఆందోళన చేపడుతామని వెల్లడించారు. అవసరమైతే వామపక్షాలు, మేధావులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే విశాఖలో రూ. 30 వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు, తమ అనుకూల వర్గాలకు పంపిణీ చేసిందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు, జీవీఎంసీ కార్పొరేటర్లు మరియు భారీ సంఖ్యలో వైయస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
