విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల శ్రీవారి ప్రసాదం తరహాలో నాణ్యమైన, రుచికరమైన ప్రసాదాలను అందించేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దుర్గ గుడి ఈఓ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

తిరుమల అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కలిసిన శీనా నాయక్ బృందం, లడ్డూ తయారీ కేంద్రం (పోటు)ను సందర్శించింది. అక్కడ ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత మరియు తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల నిర్వహణ, వడ్డన వంటి సాంకేతిక అంశాలను తిరుమల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై నిర్మించ తలపెట్టిన అన్నప్రసాద భవనానికి సంబంధించి తిరుమల ఇంజనీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. త్వరలోనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన ప్రసాదాలు అందిస్తామని ఈఓ శీనా నాయక్ వెల్లడించారు.

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కోటేశ్వరరావు, రాంబాబు మరియు AEO లు పాల్గొన్నారు.
