గంజాయి, మాదక ద్రవ్యాల ముప్పు నుండి భావి తరాలను రక్షించుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గంజాయి నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కేజీ నుంచి పీజీ వరకు విద్యా ప్రణాళికలో (Curriculum) డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని మంత్రి అధికారులను ఆదేశించారు.మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి విముక్తి కలిగించేందుకు ఎన్జీవోల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా డీ-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గంజాయి రవాణాను పర్యవేక్షించేందుకు ‘ఈగల్’ యాప్‌ను ‘లీప్’ యాప్‌తో అనుసంధానించాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి సాగును అధికారులు విజయవంతంగా అరికట్టారని, ఏపీ ఇప్పుడు ‘జీరో గంజాయి సాగు’ రాష్ట్రంగా మారిందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మిగిలిన 30 శాతం లక్ష్యం దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పటివరకు 1,721 కేసులు నమోదు చేసి, 4,421 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 40 వేల ఈగల్ క్లబ్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
