ఆధ్యాత్మిక క్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద రథాలలో ఒకటిగా పేరుగాంచిన కదిరి రథాన్ని లాగేందుకు కాకినాడ జిల్లా తాళ్లరేవు నిపుణులు అత్యంత శక్తివంతమైన, భారీ కొబ్బరి తాడును సిద్ధం చేశారు.
సుమారు 400 అడుగుల పొడవు, 30 అంగుళాల మందంతో ఈ భారీ తాడును తయారు చేశారు. దీని మొత్తం బరువు దాదాపు 2 టన్నులు.220 చిన్న తాళ్లను ఒకటిగా కలిపి ఒక ప్రధాన తాడును, అలా నాలుగు ప్రధాన తాళ్లను కలిపి ఈ మహా తాడును రూపొందించారు. తాళ్లరేవుకు చెందిన 300 మంది కార్మికులు ఏడు రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి దీనిని పూర్తి చేశారు. స్వామివారి రథం కోసం కావడంతో కార్మికులు అత్యంత భక్తిశ్రద్ధలతో, సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ ఈ తాడును అల్లారు. వందలాది మంది భక్తులు రథాన్ని లాగే సమయంలో తాడు తెగకుండా ఉండటానికి, తాళ్లరేవులో తయారయ్యే నాణ్యమైన తాళ్లనే ఏళ్ల తరబడి కదిరి ఆలయానికి వినియోగిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం ఈ తాడును ప్రత్యేక వాహనంలో కదిరి క్షేత్రానికి తరలించనున్నారు.
