గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ భూ బదలాయింపును వ్యతిరేకిస్తూ గురువారం విశాఖలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రుషికొండ వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి గీతం యూనివర్సిటీ ప్రధాన గేటు వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. యూనివర్సిటీ గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, చిన్న శ్రీను మరియు భారీ సంఖ్యలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టడం భూదోపిడీయేనని నేతలు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నిరసనల నేపథ్యంలో గీతం యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
