AP :శాలిహుండంలో వేణుగోపాలుడికి చక్రతీర్థ స్నానం

January 29, 2026 4:58 PM

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గార మండలం శాలిహుండం (శ్వేతగిరి) క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఇక్కడ కొలువుదీరిన కాళీయమర్ధన వేణుగోపాలస్వామి యాత్ర గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఏపీతో పాటు ఒడిశా నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో శ్వేతగిరి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. అర్ధరాత్రి వేళ స్వామివారికి జరిగిన క్షీరాభిషేకంతో యాత్ర కీలక ఘట్టం ప్రారంభమైంది.గురువారం ఉదయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో వంశధార నదీ తీరానికి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రతీర్థ స్నానం చేయించారు. వంశధార నదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు.. మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ కొండపై ఉన్న వీర వసంతీశ్వరస్వామి, అయ్యప్ప, ఆంజనేయ స్వామివార్లను దర్శించుకున్నారు.

భక్తుల సౌకర్యార్థం వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. కొండపై ప్రదర్శించిన బుర్రకథలు, నాటకాలు భక్తులను అలరించాయి. సీఐ సన్యాసినాయుడు పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటుతో యాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సుగ్గు మధు రెడ్డి, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media