రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం వైద్యారోగ్య శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలని సీఎం ఆదేశించారు. మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ పాలసీ ద్వారా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉన్న ‘సంజీవని’ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడంతో పాటు 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 730 మంది మల్టీపర్పస్ మేల్ హెల్త్ అసిస్టెంట్ల నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై నిరంతరం పర్యవేక్షించేందుకు ‘అవేర్-2.0’ (AWARE 2.0) వ్యవస్థను వినియోగించాలని, అలాగే ప్రజల కోసం న్యూట్రిషన్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
