ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి జరిగిన పవిత్ర అభిషేక సేవలో మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
తిరుమలకు చేరుకున్న మంత్రి టీజీ భరత్‌కు TTD ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పారిశ్రామికంగా ఏపీ మరింత వృద్ధి సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి మీడియాకు తెలిపారు.
