“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే మా ప్రభుత్వ ధ్యేయం. అందులో విద్యార్థులే కీలక భాగస్వాములు” అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు.

యువగళం పాదయాత్ర తన జీవితాన్ని మార్చేసిందని, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూశాకే ఇప్పుడు ప్రభుత్వంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని లోకేష్ తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటివరకు వివిధ రంగాల్లో 4 లక్షల ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచామని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పనిని సులువు చేస్తుంది కానీ, దానిపైనే పూర్తిగా ఆధారపడి మీ సృజనాత్మకతను వదులుకోవద్దని విద్యార్థులకు సూచించారు. పరిశ్రమలు కేవలం CSR నిధులే కాకుండా, వర్సిటీల్లో పరిశోధనలకు (R&D) కూడా నిధులు ఇవ్వాలని కోరారు. ఆక్వా, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు రావాలన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు ముఖ్యమని, అందుకే చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. “అమ్మకు చెప్పలేని పని ఏదీ చేయకూడదు” అన్న సూత్రాన్ని విద్యార్థులు పాటించాలని కోరారు.
