జిల్లా రైతులకు ఆధునిక వ్యవసాయ మెళకువలను చేరువ చేయడంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కేంద్రాల్లో 2024-25 సంవత్సరానికి గాను ‘ఉత్తమ విస్తరణ సేవల’ విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
గుంటూరులోని లామ్ ఫాంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదా జయలక్ష్మిదేవి చేతుల మీదుగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. జిల్లాలో సాగు ఉత్పాదకత పెంపునకు శాస్త్రవేత్తలు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ సునీత, డాక్టర్ హరికుమార్ చేసిన నిరంతర కృషికి ఈ గుర్తింపు దక్కింది. అన్నదాతలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, కొత్త రకం వంగడాలు మరియు సాగు పద్ధతులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కేవీకే ప్రదర్శించిన చొరవను యూనివర్సిటీ ఉన్నతాధికారులు ప్రశంసించారు.ఈ గుర్తింపు తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో రైతు సేవలో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని కేవీకే ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.
