విశాఖ నగర నడిబొడ్డున ఉన్న సుమారు రూ. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షులు కే.కే.రాజు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
విశాఖ ఎంపీకి చెందిన గీతం విద్యా సంస్థలకు ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేసేందుకు జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో చేర్చడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర అని మండిపడ్డారు. ఈ నిరసనలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరియు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, విశాఖ నగర అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ తీర్మానాన్ని తక్షణమే విరమించుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మరియు అనుబంధ విభాగాల నేతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
