“ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన అనకాపల్లిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో జరుగుతున్న ‘అనకాపల్లి ఉత్సవ్’ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి పర్యాటక పండుగ ఇది. ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం బీచ్‌లను అత్యాధునిక వసతులతో సుందరీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ తదితరులు పాల్గొని వేడుకలకు మరింత శోభను చేకూర్చారు.కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిందని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. లంబసింగిలో టెంట్ సిటీ, కారవాన్ పార్కుల ఏర్పాటును ఆయన ఉదాహరణగా చూపారు. ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు, థింసా నృత్యాలు, స్థానిక వంటకాలు మరియు సినీ కళాకారుల ప్రదర్శనలతో ఉత్సవ ప్రాంగణం హోరెత్తింది.
కొండకర్ల ఆవ, ముత్యాలమ్మపాలెం బీచ్‌లను పర్యాటక చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
