AP: కోర్టుల్లో ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ వాతావరణం ఉండాలి – జస్టిస్ గీతా మిట్టల్

February 2, 2026 6:09 PM

లైంగిక నేరాల బాధితులు, పిల్లలు మరియు బెదిరింపులకు గురవుతున్న సాక్షులు నిర్భయంగా వాంగ్మూలం ఇచ్చేలా అన్ని కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు (VWDC) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ గీతా మిట్టల్ పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు కలెక్టరేట్‌లో న్యాయాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సాక్షులు నిందితులను నేరుగా ఎదుర్కోకుండా ప్రత్యేక గదులు, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించాలని ఆమె సూచించారు. కోర్టులు భయంకరంగా ఉండకూడదని, పిల్లల కోసం బొమ్మలు, పుస్తకాలతో కూడిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ గదులను ప్రధాన కోర్టుకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు. సాక్షుల పేరు, చిరునామా, పాఠశాల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విచారణ సమయంలో పిల్లలకు అర్థమయ్యే సరళమైన భాషను ఉపయోగించాలని, అవసరమైతే అనువాదకులు, సంకేత భాష నిపుణుల సహాయం తీసుకోవాలని న్యాయాధికారులకు సూచించారు. న్యాయవాదుల కఠినమైన ప్రశ్నలు, పదే పదే విచారణల వల్ల బాధితులు మళ్లీ మానసిక వేదనకు గురికాకుండా న్యాయమూర్తులు నాయకత్వం వహించి గౌరవప్రదంగా విచారణ జరపాలని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media