చదువుతో పాటు క్రీడల్లోనూ భీమిలి చిన్నారులు తామేంటో నిరూపించుకున్నారు. విశాఖ స్వర్ణ భారతి స్టేడియంలో జరిగిన 9వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో రేఖవాని పాలెం బ్లూమింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు.

ఆరేళ్ల చిన్నారి కె. బ్లెస్సీ కరాటేలోని ‘కాటా’ విభాగంలో గోల్డ్ మెడల్, ‘కుమితే’ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి అందరినీ ఆకట్టుకుంది. బ్లెస్సీతో పాటు ఎం. సాధ్య, టి. హన్విక, జి. గహనవి, జి. హన్వితలు కూడా పతకాలు సాధించారు. స్కేటింగ్ విభాగంలో యూకేజీ విద్యార్థిని ఎం. సంయుక్త జిల్లా స్థాయిలో పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ పాణిగ్రాహి, ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి విద్యార్థినులను అభినందించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన మాస్టర్ రెమో యాదవ్, కోచ్‌లు రాంబాబు, నిఖిల్ లను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది.
