జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం మరియు ఇతర చట్ట వ్యతిరేక పనులను అరికట్టడానికి అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో కూడిన ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహిస్తున్నారు.

మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో, అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అనుమానిత ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా పొదలు, శివారు ప్రాంతాల్లో దాగి ఉన్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తిస్తున్నారు. సోమవారం నాడు ప్రొద్దుటూరు రోడ్డు, జగనన్న కాలనీ, కొత్త బైపాస్, నంద్యాల రోడ్డు, ఇండస్ట్రియల్ ఏరియా మరియు ఇందిరమ్మ కాలనీల్లో డ్రోన్ నిఘా మధ్య సోదాలు నిర్వహించారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను డ్రోన్ టెక్నాలజీతో పట్టుకుని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మత్తు పదార్థాలకు బానిసలైనా కఠిన చర్యలు తప్పవని సీఐ రమణా రెడ్డి హెచ్చరించారు. పట్టణ ప్రజల రక్షణ కోసం ఈ నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
