రాజధాని అమరావతిలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం బాధితుల గోడుతో మార్మోగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, ఆన్లైన్ రికార్డుల తారుమారు మరియు విదేశాల్లో చిక్కుకున్న తమ వారిని కాపాడాలంటూ పెద్ద ఎత్తున అర్జీలు వెల్లువెత్తాయి.

మాచర్లకు చెందిన చెన్నకేశవరావు తన 2.50 ఎకరాల భూమిలో 1.50 ఎకరాలను వైసీపీ నేతలు అధికారుల అండతో వేరే వారి పేరున మార్చారని ఫిర్యాదు చేశారు.కావలి మండలం పెద్దపట్టపుపాలెంలో డ్వాక్రా మహిళలు సాగు చేసుకుంటున్న భూమిని మాజీ సర్పంచ్ అక్రమంగా పట్టాలు చేయించుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.తిరుపతి జిల్లాకు చెందిన దిలీప్ కుమార్ తన తల్లి మస్కట్లో ఏజెంట్ల చేతిలో మోసపోయిందని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమెను భారత దౌత్య కార్యాలయం ద్వారా స్వదేశానికి రప్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య, బాపట్ల, నంద్యాల జిల్లాల నుండి వచ్చిన పలువురు రైతులు తమ సాగు భూములు, ఇళ్లు రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు అందడం లేదని మొరపెట్టుకున్నారు. వీటితో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగ అవకాశాలు మరియు వైద్య సహాయం కోసం అనేక మంది బాధితులు విజ్ఞప్తి చేశారు. అధికారులు వీటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
