ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా నిలిపే లక్ష్యంతో మంత్రి నారాయణ బృందం లండన్‌లో పర్యటిస్తోంది. లండన్‌లోని అత్యాధునిక కట్టడాలు, నగర ప్రణాళికను అధ్యయనం చేసి, వాటిని అమరావతిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రపంచంలోనే ఎత్తైన కాంటిలివర్డ్ అబ్జర్వేషన్ వీల్‌గా పేరుగాంచిన ‘లండన్ ఐ’ని మంత్రి బృందం సందర్శించింది. ఇదే తరహాలో అమరావతిలోని కృష్ణా నది ఒడ్డున ఒక భారీ ఐకానిక్ వీల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. థేమ్స్ నది తీరాన్ని పర్యాటక మరియు వాణిజ్య కేంద్రంగా మార్చిన తీరును మంత్రి పరిశీలించారు. అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో బోటింగ్, సుందరీకరణ పనులకు లండన్ నమూనాను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. మూతపడిన పవర్ స్టేషన్‌ను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చిన విధానాన్ని అధ్యయనం చేశారు. పారిశ్రామిక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా ఎలా మార్చవచ్చో ఇక్కడి అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం లండన్‌లోని ఒలింపిక్ విలేజ్ మరియు క్రీడా ప్రాంగణాలను మంత్రి బృందం పరిశీలించింది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తో సమావేశమై రవాణా సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థ మరియు పట్టణ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన పొందారు.
