మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. విజయవాడ రైల్వే స్టేషన్ పశ్చిమ టెర్మినల్ (తారా పేట) సౌత్ బుకింగ్ కౌంటర్ సమీపంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది.
మద్యం సేవించిన రాము, సాయి అనే ఇద్దరు స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిందితుడు రాము దాడి చేయడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్యకు పాల్పడిన రాముపై గతంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డెకాయిట్ కేసుతో సహా మొత్తం 15 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న జీఆర్పీ (GRP) సీఐ జె.వి. రమణ, ఆర్పీఎఫ్ (RPF) సీఐ ఫతే అలీ బేగ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
