దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను మార్చి 31, 2026 లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.దివ్యాంగ పాఠశాలల్లో 100% అడ్మిషన్లు జరిగేలా చూడాలని, అవసరమైన మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి వయోవృద్ధుడికి వయో వందన ఆయుష్మాన్ భారత్ కార్డులు అందేలా చూడాలని, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు వంటి సహాయ పరికరాల పంపిణీని పెంచాలని ఆదేశించారు.అర్హులైన దివ్యాంగులకు త్రీ వీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికను త్వరగా ముగించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.
