తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ ప్రభుత్వం క్లీన్ చీట్ వచ్చినట్లు నాటకాలు ఆడుతోందని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, తిరుమల నుంచి తెప్పించిన పవిత్ర లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు.
సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు పామాయిల్ వాడి, వైసీపీ పాలకులు రూ. 233 కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని కిషోర్ ఆరోపించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నాయకులు, ఇప్పుడు తప్పు చేయనట్లుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గోవింద నామస్మరణతో భక్తులకు లడ్డూలు పంపిణీ చేస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
