తిరుమల లడ్డూ కల్తీ పాపం నుంచి తప్పించుకోవడానికే వైఎస్ జగన్ ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, అంబటి రాంబాబు మరియు జోగి రమేష్‌లను జగనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
“లడ్డూ నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికే ఇప్పుడు పోలీసులపై అవాకులు చవాకులు పేలుతున్నారు.””పోలీసులకు బట్టలు విప్పడం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదం. ఆయన అరాచక పాలన చూసి ప్రజలే ఆయనకు ఎప్పుడో బట్టలు ఇప్పించి నిలబెట్టారు.” రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటం ప్రభుత్వ బాధ్యతని, పోలీస్ యాక్ట్-30ని ఉల్లంఘిస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగించి, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
“రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం కాదు.. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అక్కడ చర్చిద్దాం” అని జగన్‌కు సవాల్ విసిరారు.CM చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
