తూర్పుగోదావరి జిల్లా (కోనసీమ) ముమ్మిడివరం మండలం చెయ్యేరు-గున్నేపల్లి గ్రామాల్లో వెలసిన సత్యమ్మ తల్లి (సత్తెమ్మ) ఆలయం జాతర ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఈ ఆలయానికి ఒక ప్రత్యేక ఆనవాయితీ ఉంది. ఎంతటి కోటీశ్వరుడైనా సరే, ఈ గ్రామానికి వచ్చి బిచ్చమెత్తుకుని, ఆ వచ్చిన దానితో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి విశిష్టత. తాజా పూలు, విశేష ఆభరణాలతో అమ్మవారిని దివ్యంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలు, పూల మాలలతో శోభాయమానంగా మారింది.తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తుల రాకతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామస్తులు, ఆలయ కమిటీ వారు భారీ ఏర్పాట్లు చేశారు.
