జిల్లాలో నేరాల నియంత్రణపై ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి అశోక్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం అయినవిల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
కోనసీమ జిల్లాలో గంజాయి కేసులు తగ్గుముఖం పట్టాయని, నేరాల రేటు అదుపులో ఉందని ఐజీ వెల్లడించారు. వేసవి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో జాతరలు ఎక్కువగా జరుగుతాయని, ఈ సమయంలో మద్యం మత్తులో యువకులు ఘర్షణలకు దిగే అవకాశం ఉందని.. అటువంటి వారిపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ కేసుల్లో చిక్కుకుని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. రెచ్చగొట్టే పోస్టులు, అభ్యంతరకరమైన కంటెంట్ పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తప్పుదోవ పడుతున్న యువకులకు జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహిస్తామని తెలిపారు.ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ ఆర్. భీమరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
