రాజానగరం మండలం భూపాలపట్నం మరియు పందిరివారి తోట పరిసరాల్లో పులి సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. ఐదు రోజులుగా అధికారుల కళ్లు గప్పి తిరుగుతున్న పులి, బహిరంగంగానే స్కూలు పరిసరాల్లో సంచరిస్తూ ఒక ఆవును, మూడు దూడలను సంహరించింది.
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అత్యవసర సమీక్ష నిర్వహించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని సూచించారు.
పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని పాఠశాలలకు ముందస్తుగా సెలవులు ప్రకటించారు. పులి కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక ఫారెస్ట్ బృందాలను రంగంలోకి దింపినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే పులిని పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని, పొలాలు, తోటలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పొలాలు, అటవీ ప్రాంతాల వైపు ఒంటరిగా వెళ్లవద్దు.పులిని చూసిన వెంటనే అటవీ లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. పులిని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదు.
