డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బుధవారం సచివాలయంలో సెర్ప్ (SERP), మెప్మా (MEPMA) అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ కోసం “స్వయం” అనే పేరును ఖరారు చేశారు.

డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, వాటికి సరైన బ్రాండింగ్ కల్పించి విక్రయాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ప్రతిపాదించిన లోగోలను పరిశీలించిన సీఎం, కేవలం అధికారుల నిర్ణయమే కాకుండా డ్వాక్రా సంఘాల మెజార్టీ అభిప్రాయం మేరకు లోగోను ఫైనల్ చేయాలని ఆదేశించారు. స్థానిక మార్కెట్లే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఉండాలని సూచించారు. “స్వయం” సహాయక సంఘాల నుంచి వస్తున్న ఉత్పత్తులు కాబట్టి, ఆ పేరులోనే మహిళా స్వశక్తి అర్థమయ్యేలా ఉండాలని సీఎం వివరించారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు సెర్ప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
