అక్కినేని నాగేశ్వరరావు (ANR) పుట్టిన గడ్డ గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు రెండో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు అక్కినేని నాగార్జున, తన తండ్రి స్థాపించిన విద్యాసంస్థపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.

విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం అక్కినేని కుటుంబం తరపున రూ. 2 కోట్ల నిధిని నాగార్జున ప్రకటించారు. ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్లను అందిస్తామని హామీ ఇచ్చారు.నాన్న పుట్టిన గడ్డకు రావడం ఎంతో భావోద్వేగంగా ఉంది. ఆయన రైతు బిడ్డ అయినా చదువుపై ఉన్న మక్కువతో 1951లోనే లక్ష రూపాయలు విరాళమిచ్చి ఈ కళాశాల స్థాపించారు” అని నాగార్జున గుర్తుచేసుకున్నారు.

ఈ వేడుకలో హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. “ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుడివాడ అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ అని గర్వంగా చెప్పుకుంటాం. నాగార్జున ఇచ్చిన రూ. 2 కోట్లను విద్యార్థుల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేస్తాం” అని MLA వెనిగండ్ల రాము పేర్కొన్నారు.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని నాగార్జున ఆవిష్కరించారు.

