ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో విశాఖ రేంజ్ పోలీసు యంత్రాంగం చేపట్టిన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర శనివారం ఇచ్చాపురంలో ఘనంగా ముగిసింది. 53 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర సాగిన ఈ చైతన్య యాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను మంత్రులు ఆవిష్కరించారు.

గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ కేంద్రంగా మారిన ఏపీని, ఇప్పుడు గంజాయి మూలాలను వెలికితీసి కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఈ యాత్ర ద్వారా యువతలో మార్పు తెచ్చామని, 53 వేల కేజీల గంజాయిని ధ్వంసం చేసి, రూ. 9.13 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు. మత్తు పదార్థాల సమాచారం కోసం ప్రజలు 1972 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని కలెక్టర్ మరియు ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ యాత్రలో 1.14 లక్షల మంది విద్యార్థులు, 36 వేల మంది ప్రజలు పాల్గొని ‘సే నో టు డ్రగ్స్ బ్రో’ (Say No To Drugs Bro) అంటూ నినదించారు.

