కడప జిల్లాలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ (ACB) అధికారులు భారీ విజయం సాధించారు. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడగా, ఆయన వెనుక ఉన్న పులివెందుల రూరల్ సీఐ ఎన్.వి. రమణను కూడా అధికారులు అరెస్ట్ చేశారు.

ఒక చైన్ స్నాచింగ్ కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. 3.5 లక్షలు డిమాండ్ చేసి, రూ. 1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు వీరిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సీఐ నివాసంలో సోదాలకు వస్తున్నారని తెలిసి, మైత్రి లేఅవుట్లోని సీఐ ఇంటి నుండి విలువైన పత్రాలు, నగదు ఉన్న రెండు సంచులను ఒక హోంగార్డు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అధికారులను చూసి భయపడి ఆ సంచులను అక్కడే పడవేసి హోంగార్డు పరారయ్యారు. సీఐ రమణకు ఇద్దరు భార్యలు ఉన్నారని గుర్తించిన అధికారులు, వారిద్దరి ఇళ్లలోనూ రాత్రి 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. సంచుల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులను ఏసీబీ లెక్కగడుతోంది. భారీగా అక్రమ ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
