భీంపూర్ మండలంలో పొలాల్లో పాదముద్రలు
ఆదిలాబాద్/కుమ్రంభీం ఆసిఫాబాద్: భీంపూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో (Tiger) పులి సంచారం కలకలం రేపింది. గురువారం భీంపూర్ అరళి (టి) గ్రామ శివారులోని కొండ ప్రాంతం, వ్యవసాయ పొలాల్లో పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. దీంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
పొలంలో పులి కనిపించిందంటూ రైతు అలర్ట్
ఓ రైతు తన పొలంలో పులిని చూసి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పులి అడవి పందిని చంపి అనంతరం అడవిలోకి వెళ్లినట్లు ఆ రైతు తెలిపారు. పులిని మరో ప్రాంతానికి తరలించాలని రైతులు అటవీ అధికారులను కోరారు.
మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు అనుమానం
టైపేశ్వర్ Tiger రిజర్వ్ నుంచి పులి భీంపూర్ పరిధిలోని అరళి (టి), గుంజాల గ్రామాల అడవుల్లోకి వచ్చినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రాంతం కోసం వెతుకుతూ మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి పెంగంగా నది దాటి పులి ఇటువైపు వచ్చినట్లు తెలిపారు.
పులి కదలికలను గుర్తించేందుకు జంతువుల కదలికలను ట్రాక్ చేసే సిబ్బందిని రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. పులి సంచారం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
చింతలమానేపల్లిలోనూ పాదముద్రలు
చింతలమానేపల్లి మండలంలోనూ పులి సంచారం కలకలం రేపింది.
ఆదిపెల్లి, డబ్బా గ్రామాల మధ్య పులి పాదముద్రలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులు చేసేందుకు రైతులు భయపడుతున్నారు.
పులిని గుర్తించి, మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 2024లో ఈస్గావ్ గ్రామంలో పత్తి కోత పనులు చేస్తున్న ఓ మహిళను పులి చంపిన ఘటనను వారు గుర్తుచేశారు.
గుంపులుగా పొలాలకు వెళ్లాలని సూచన
మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ నుంచి ఓ పులి సిర్పూర్ (టి) అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి కడంబ అడవుల మీదుగా చింతలమానేపల్లి ప్రాంతంలోకి ప్రవేశించినట్లు చెప్పారు.
పత్తి పొలాల్లో కలుపు తీసే సమయంలో రైతులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. పులి సంచారాన్ని అడ్డుకునేందుకు శబ్దం చేస్తూ వ్యవసాయ పనులు చేయాలని తెలిపారు.
పులి కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.



