టెలివిజన్ ఛానళ్లలో ప్రకటనల సమయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విధించిన పరిమితిని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయరాదన్న నిబంధన రాజ్యాంగబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది.
ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలు ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, ప్రాంతీయ ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. గంట వ్యవధిలో 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల స్వీయ ప్రచార ప్రకటనలకు మాత్రమే అనుమతిస్తూ ట్రాయ్ జారీ చేసిన నిబంధనలు తమ వ్యాపార, వాక్ స్వాతంత్య్ర హక్కులను ఉల్లంఘిస్తున్నాయని బ్రాడ్‌కాస్టర్లు వాదించారు. అయితే, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అధిక ప్రకటనల నుంచి వీక్షకులను రక్షించడం, ప్రసారాల నాణ్యతను కాపాడటం ట్రాయ్ బాధ్యత అని పేర్కొంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా టీవీలో ప్రకటనలను స్కిప్ చేసే అవకాశం లేనందున, వీక్షకుల హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది.

