బాధిత కుటుంబాలకు నష్టపరిహారం.. 2027 మార్చి 31లోగా చెల్లించాలని ఆదేశం
భారత న్యాయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గుజరాత్ హైకోర్టు అత్యంత కీలకమైన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో.. దారుణ మారణహోమానికి ఒడిగట్టిన 38 మంది ఉగ్రవాదులకు కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధర్మాసనం వంద శాతం సమర్థిస్తూ ఖరారు చేసింది. ఒకే కేసులో ఇంతపెద్ద సంఖ్యలో మరణశిక్షలు కన్ఫర్మ్ కావడం దేశంలోనే ఇదే మొదటిసారి. వీరితో పాటు మరో 11 మందికి పడిన యావజ్జీవ కారాగార శిక్షను కూడా కోర్టు అలాగే ఉంచింది.
జస్టిస్ అల్పేష్ కొగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన గుజరాత్ హైకోర్టు ధర్మాసనం ఈ కేసును అంత ఈజీగా తేల్చలేదు. గత రెండున్నరేళ్లుగా దాదాపు 248 సార్లు అప్పీళ్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాతే ఈ తుది తీర్పును ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఇండియన్ ముజాహిదీన్ , సిమి కి చెందిన ఉగ్రమూకలే ఈ దారుణ కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో పక్కా ఆధారాలతో నిరూపించింది. దాంతో నిందితులపై మోపిన దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా (UAPA) చార్జీలను న్యాయస్థానం ఏకీభవించింది.
అసలు ఆ రోజు అహ్మదాబాద్‌లో ఏం జరిగిందనే హిస్టరీ చూస్తే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. జులై 26, 2008న గుజరాత్‌లోని ప్రముఖ వాణిజ్య నగరం అహ్మదాబాద్‌లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. కేవలం 70 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 21 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సులను టార్గెట్ చేయడమే కాకుండా, వారు చేసిన అత్యంత అమానవీయమైన పని ఏంటంటే..
మొదటి విడత పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న సివిల్ హాస్పిటల్‌ను టార్గెట్ చేస్తూ రెండో విడత బాంబులు పేల్చారు. ఈ ఘోర ఘాతుకంలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 246 మంది తీవ్రంగా గాయపడి జీవితాలను కోల్పోయారు.
ఈ చారిత్రాత్మక తీర్పుతో పాటు బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచేలా హైకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి.
తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ. 5 లక్షలు ఇవ్వాలి. సాధారణంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున అందించాలని ఆదేశించింది. ఈ నష్టపరిహార ప్రక్రియ మొత్తాన్ని మార్చి 31, 2027 లోగా కంప్లీట్ చేయాలని న్యాయస్థానం డెడ్‌లైన్ విధించింది. ఏదేమైనా, 18 ఏళ్ల కిందట ఉగ్రవాదులు చేసిన ఘోరానికి న్యాయస్థానం ఇచ్చిన ఈ పవర్ఫుల్ జడ్జ్మెంట్ బాధితుల కుటుంబాల్లో కాస్తయినా ఊరటనిచ్చిందనే చెప్పాలి.



